Wednesday, May 7, 2008

యానాన్ని ఆంధ్రాలో ఎందుకు కలపలేదు?


యానాం విమోచనోధ్యమము అనే నా వ్యాసాన్ని చదివి కొన్ని ప్రశ్నలు అడిగిన రాజేంద్ర కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, వారిప్రశ్నలకు జవాబుగా ఈ పోష్టు.

ఈ రోజు కు కూడా యానం ఆంద్రప్రదేశ్ లో కలవకుండా ప్రత్యేకంగా ఉండటానికి ప్రధాన కారణం.
ఫ్రెంచి వాళ్లు తమకాలనీలైన యానం, పాండిచేరీ, మాహె, కారైకాలను వదిలి వెళ్లిపోయేటపుడు , భారత ప్రభుత్వంతో 1956 may 28 న ట్రీటీ ఆఫ్ సెషను (treaty of cession) ను చేసుకున్నారు.


ఈ ఒప్పందములో ఆర్టికిల్ 2 ఇలా చెపుతుంది.
The Establishments will keep the benefit of the special administrative status which was in force prior to 1 November, 1954. Any constitutional changes in this status which may be made subsequently shall be made after ascertaining the wishes of the people.


( సారాంశం: ఈ స్థావరాలన్నీ, 1 నవంబరు 1954 కు పూర్వము కలిగిఉండినటువంటి ప్రత్యేక పరిపాలనా హోదాను నిలుపుకుంటాయి. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను తెలుసుకొన్న తరువాతే రాజ్యాంగపరంగా ఈ హోదాను మార్చవలసి ఉంటుంది)


1954 కు పూర్వం అంటే, అప్పుడు ఈ ప్రాంతాలు మిగిలిన స్వతంత్ర్య భారతావనిలో కలువకుండా ప్రత్యేకం గా ఫ్రెంచి వారిచే పరిపాలింపబడిఉన్నాయి. భారత స్వాతంత్ర్యానికి ముందు కూడా ఇవి బ్రిటిష్ వారి పాలనకు అతీతంగానే పరిగణింపబడ్డాయి.

పై క్లాజులో ఆ ప్రత్యేకత ను నిలబెట్టమనే కోరటం జరిగింది. అంటే ప్రత్యేక పరిపాలనా హోదా కల్పించాలనేది ఫ్రెంచి వారి వెళ్లిపోయేముందు అడిగిన చివరికోరిక. దానికనుగుణంగా భారత ప్రభుత్వం 1 జూలై, 1963 లో జరిపిన రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రాంతాలను యూనియను టెరిటరీ ఆఫ్ పాండిచేరీ గా ఏర్పరిచింది. అలా వీటిని కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పరచటంద్వారా ప్రత్యేక హోదా కల్పించి ఫ్రెంచి ప్రభుత్వానికి ఇచ్చినమాటను భారత ప్రభుత్వం నిలబెట్టుకుంది.


ఇంతే కాక ఈ ఒప్పందంలో ఫ్రెంచి ప్రభుత్వం ఈ ప్రాంతంలో అప్పటిదాకా ఉండిన ఫ్రెంచి సంస్కృతిని కాపాడమని కోరింది. అప్పట్లో నెహ్రూ గారుకూడా ఈ ప్రాంతాలను Windows open to France అని అభివర్ణించాడు కూడా.


ఇంత చేసినా ఫ్రెంచ్ ప్రభుత్వం సంతృప్తి చెందక 1962 లో ఈ ప్రాంత ప్రజలకు భారత పౌరులుగా ఉంటారా లేక ఫ్రెంచ్ పౌరులుగా మారిపోతారా అని ఒక సౌహార్ధ్ర పూర్వక ఐచ్చికతను ఇచ్చింది. ( రాత్రిపూట మూట ముల్లె సర్ధుకొని పోయిన బ్రిటిష్ ప్రభుత్వం తో పోల్చండి). అప్పటి దాకా ఫ్రెంచి సంస్కృతి, సాంప్రదాయాలను తరతరాలు గా జీ్ర్ణించుకొన్న కొంతమంది ఈ ఐచ్చికత ద్వారా ఫ్రెంచి పౌరసత్వాన్ని తీసుకున్నారు. అప్పట్లో యానం నుంచి పంతొమ్మిది కుటుంబాలు ఇలా ఈ ఐచ్చికత ద్వారా ఫ్రెంచి పౌరసత్వాన్ని పొందాయి. ఈ ఐచ్చికతగురించి ఎక్కువ మందికి తెలియక పోవటంతో ఆ తరువాత కూడా కొద్దిమంది ప్రయత్నించుకొని ఫ్రెంచి పౌరసత్వాన్ని పొందారు. 1987 లెక్కల ప్రకారం యానాంలోని ఫ్రెంచ్ నేషనల్స్ సంఖ్య 91. వీరి సంతతిలో చాలా మంది ఫ్రాంస్ లో జీవిస్తున్నారు. అయినప్పటికీ భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలలోనే తమ మూలాలున్నాయన్న విషయాన్ని వీరేనాడు విస్మరించలేదు. వీరు ఉండేది ఫ్రాంసులోనైనా ఎక్కువమంది ఇక్కడి అమ్మాయిల/అబ్బాయిలనే పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇలాగ ఫ్రెంచి పౌరసత్వాన్ని కలిగిఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకోవటానికి పెద్ద పోటీ కూడాను. ఎందుకో అర్ధం అయ్యిందనుకుంటాను.


యానంలో ఉండిన సీనియర్ సిటిజనులైన ఫ్రెంచ్ నేషనల్స్ కు ఫ్రెంచ్ ప్రభుత్వం నుండి నెల నెలా పించను అందుతుంది. ( మన ఒల్డ్ ఏజ్ పెంషను లాగ). ఇది భారత రూపాయిలలో మారేసరికి ముప్పై వేల రూపాయిల పైమాటే అవుతుంది. వృద్దాప్యంలో అదొక ముచ్చట.


ఇక పోతే ఈ ప్రాంతాలను సమీప రాష్ట్రాలలో విలీనం చెయ్యాలని మొరార్జీ దేశాయ్ టైములొ ఒక ప్రయత్నం జరిగింది. అంటే యానాన్ని ఆంధ్రాలోను, పుదుచేరీ, కారైకాల్ లను తమిళనాడులోను, మాహె ను కేరళలోను కలిపేయటాని కన్నమాట. దానిని ఈ ప్రాంత ప్రజలు ముక్తకంఠంతో ప్రతిఘటించారు. మొరార్జీ దేశాయ్ కూడా 1956 నాటి ఒప్పందాన్ని చూసి నాలిక్కరుచుకొని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారని అంటారు.


ఈ రోజు కు కూడా యానం ఆంద్రప్రదేశ్ లో కలవకుండా ప్రత్యేకంగా ఉండటానికి మరొక ప్రధాన కారణం ఆనాటి నాయకుల దార్శనికత.


విమోచనోధ్యమం వ్యాసంలో చెప్పినట్లు 1948 లోనే భారత-ఫ్రెంచ్ ప్రభుత్వాలు ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం ఈ ప్రాంతప్రజలు రిఫరెండం ద్వారా వారు భారతదేశంలో కలవాలా ఒద్దా అనే విషయాన్ని తేల్చుకోవాలి. తదనుగుణంగా జూను పంతొమ్మిది, 1949 లో అప్పటికి ఒక ఫ్రెంచి కాలనీ గా ఉన్న చంద్రనాగూర్, సమీపంలోని బెంగాల్ రాష్ట్రంలో విలీనం అయిపోయింది. పోలైన 12000 ఓట్లలో 7500 ఓట్లు భారతావనిలో విలీనానికి అనుకూలంగాను, 114 ఓట్లు వ్యతిరేకంగాను పోల్ అయ్యాయి. ఆవిధంగా ఆ ప్రాంతానికున్న ఫ్రెంచ్ కనెక్షను తుంచబడింది.
అలా తొందరపడి రిఫరెండం జరిపేసుకోవటంవల్ల చంద్రనాగురు ఈనాడు ఈ అఖండ భారతావనిలో ఉండే వేన వేల మునిసిపాలిటీలలో ఒకటిగా కనుమరుగైంది.


ఇక మిగిలిన నాలుగు ప్రాంతాలు ఫ్రెంచి వారిని అంత సులభంగా చేజార్చుకోవటానికి ఇష్టపడలేదు. భారతప్రభుత్వం కూడా పరిస్థితులు పక్వానికొచ్చేదాకా ఎదురుచూసింది. హైదరాబాద్ లొలాగా సైనిక పదఘట్టనలతో బలప్రయోగానికి సాహసించలేదు. అందునా ఇది దేశాల నడుమ వ్యవహారమాయె!


చంద్రనాగూర్లోని స్థానిక నాయకులందరూ పొరుగునున్న బెంగాల్ రాష్త్ర కమ్యూనిష్టు నాయకుల ప్రభావంలో ఉండి ఆ ప్రాంతాన్ని, విదేశీ పాలనా చెరనుండి విడిపించి పొరుగు రాష్ట్రమైన బెంగాల్ లో విలీనంచేయించటం లో కృతకృత్యు లయ్యారు.

కానీ అప్పటి యానాం నాయకులు పొరుగున ఉన్న ఆంధ్రా నాయకుల ప్రభావంలో కాక, పాండిచేరీ లోని నాయకుల నాయకత్వంలో నడిచారు. 1948 భారత్-ఫ్రెంచ్ ఒప్పందం ప్రకారం రిఫరెండం ప్రక్రియకు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతాన్నే ప్రాతిపదికగా తీసుకోవాలి. దీన్ని బట్టి చూస్తే అప్పటి యానాం నాయకులు ఆంధ్రావైపు ఎక్కువగా మొగ్గుచూపి ఉన్నట్లయితే చంద్రనాగూర్ వలెనే యానాం కూడా, ఆంధ్ర ప్రదేశ్ లో ఏ విశిష్టతా లేని ఒక పంచాయతీ గా మిగిలిపోయేది. కాకినాడ మునిసిపల్ కౌంసిల్ కూడా యానాన్ని భారతావనిలో కలిపేసుకోవాలని తీర్మానం చేసింది. కానీ అప్పటి యానాం నాయకులు ముందుచూపుకలిగి పాండిచేరీ తో ఉన్న సంబంధాలను తెంపుకోలేదు. పాండిచేరీ తో తమ అనుబంధాన్ని త్రుంచుకోవాలని కలలో కూడా అనుకోలేదు. అపుడు మాత్రమే యానం ప్రజలకు మేలు జరుగుతుందని భావించారు. ఇది వారి దార్శనికతకు, రాజకీయ పరిణితికి నిదర్శనంగా చెప్పుకోవచ్చును.
పుదుచ్చేరీ నాయకులు ఈ నాటికీ కూడా యానాన్ని తమలో ఒక అంతర్భాగంగానే చూస్తున్నారు తప్ప వేరుగా చూడలేదు.


డిల్లీ కి ఇచ్చినట్టుగా పుదుచేరీ కి కూడా స్టేట్ హుడ్ ఇస్తారని ఈ మద్య వింటున్నాము. ఏమవుతాదో చూడాలి.

బొల్లోజు బాబా

యానాం పై తదుపరి వ్యాసం: 18 వ శతాబ్ధంలో యానంలో జరిగిన బానిస వ్యాపారం.

యానం దృశ్యాలు

నేను బంధించిన యానాం సుందర దృశ్యాలు

బొల్లోజు బాబా

Tuesday, May 6, 2008

యానాం విమోచనొద్యమం





ఉపోద్ఘాతం

సుమారు రెండు శతాబ్దాల ఫ్రెంచ్ పాలన నుండి యానం పదమూడు జూన్ పంతొ్మ్మిదివందల యాభైనాలుగున విమోచనం చెందింది. ఈ కాలంలోనే ఫ్రెంచి వారి వలస పాలన నుండి ఇండోచైనా విమోచనం చెందటానికి ఘోరమైన యుద్దం చేయవలసి వచ్చింది. కానీ భారత దేశంలోని ఫ్రెంచి కాలనీల విమోచనం చర్చల ద్వారా, అహింసాయుత పద్దతుల ద్వారా, రాజకీయ ఎత్తుగడలతో జరిగింది. అప్పటికి మిగిలున్న నాలుగు ఫ్రెంచి కాలనీలైన పాండిచేరీ, మాహే, కారైకాల్ మరియు యానాంలలో, యానామే మొదటగా విమోచనం చెందినట్లుగా ప్రకటించుకుంది. ఇది తెలుగు వారమైన మన అందరికీ గర్వకారణమే ఎందుకంటే ఇలా జరగటం వల్ల యానాం ఓ క్రాంతదర్శి గా చరిత్ర కెక్కింది.


అప్పటి కాలమాన పరిస్థితుల దృష్ట్యా యానాం విమోచనం భిన్న కోణాలలో ఈ విధంగా దర్శించబడ్డది.


1. విమోచన ఉద్యమకారుల దృష్టిలో యానాం విమోచనమనేది ఫ్రెంచి పాలనా దాశ్య సృంఖలాలనుండి విముక్తమై స్వాతంత్ర్య భారతావనిలో విలీనం కావటానికి జరిపిన మహోద్యమము.

2. భారత ప్రభుత్వము యానం విమోచనాన్ని స్వాగతించదగిన దురదృష్టకరమైన సంఘటనగా అభివర్ణించింది.

3. భారత ప్రభుత్వం తన దేశ భక్తులతో చేయించిన ముట్టడిగా దీన్ని ఫ్రెంచి ప్రభుత్వం భావించింది.

4. యానం నాయకులు ఆంధ్రా ప్రజలతో కలసి ఫ్రెంచి వారినుండి అధికారాలను చేజిక్కించుకొని యానం విమోచనం చెందిందని ప్రకటించారని కొంతమంది స్థానికులు భావించారు.


ఏ వాదన ఎలా సాగినా యానం ఫ్రెంచి పాలన నుండి విమోచనం చెంది భారతావనిలో విలీనం చెందటం అనేది అప్పటికి ఒక చారిత్రక అవసరం. ఈ మహత్కార్యాన్ని భుజాన వేసుకొని ఉద్యమాన్ని నడిపించిన నాయకుల దేశభక్తిని శంకించలేము. వారు ఈ ఉద్యమాన్ని శాంతియుత, ప్రజాస్వామ్యయుతంగా నడిపించిన తీరు అనన్యమైనది. భారత్-ఫ్రెంచ్ కాలనీల చరిత్రలోనే ఒక మైలు రాయిగా నిలచిన యానాం విమోచనమును జరిపించిన ఆనాటి నాయకుల దార్శనికత అత్యంత ఉన్నతమైనది.


విమోచనమంటే ఉన్నపళంగా బయటకు వచ్చేసి, మనల్ని మనం పునర్నింమిచుకోవటమే అని జేన్ ఫాండా అనే అమెరికన్ రచయిత్రి అంటుంది. ఫ్రెంచి ప్రభుత్వం స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే తన మూడు సూత్రాలకు అనుగుణంగా ఈ కాలనీల పరిపాలన సాగించటంవలన ఈ ప్రాంత ప్రజలు ఫ్రెంచి వారి పట్ల మమకారాన్ని ఏర్పరచుకున్నారు. తమపొరుగు ప్రాంతంలో బ్రిటీష్ వారు సాగించిన దుష్టపాలన, ఈ కాలనీల వాసులలో ఫ్రెంచి వారిపట్ల ప్రేమను బలోపేతం చేసింది. అందుచేత తరతరాలుగా జీర్ణించుకున్న ఫ్రెంచ్ సంస్కృతి పట్ల తమకున్న విధేయతనుంచి ఉన్నపళంగా బయటకు వచ్చేయడం కొంతమందికి అంత సులువు కాలేదు. కనుక ఆ తరంలోని కొంతమందికి తమ ఫ్రెంచి విధేయతకు, మారుతున్న రాజకీయ పరిస్థితులకు మద్య సంఘర్షణను ఎదుర్కోవలసి వచ్చింది. ఆఘర్షణ ఫలితమే యానంలో జరిగిన విమోచనోద్యమము.


ఫ్రెంచ్ కాలనీల విమోచన నేపధ్యం

1947 లో బ్రిటిష్ వారు భారత భూభాగాన్ని విడిచిపెట్టిపోవడంతో ఫ్రెంచ్ కాలనీలలోని ప్రజలలో కూడా భారత జాతీయవాద ధోరణుల తీవ్రత పెరిగింది. అప్పటికి పాండిచేరీ, కారైకాల్, మాహే, యానం మరియు చంద్రనాగూర్ అనే అయిదు ప్రాంతాలు ఫ్రెంఛి వారి ఆధీనంలో ఉన్నాయి. ఈ అయిదు ప్రాంతాలు భౌగోళికంగా దూరదూరంగా, సాంస్కృతికంగా భిన్నంగా ఉండటం వలన వీటిని నియంత్రించటం ఫ్రెంచి వారికి కష్టంగా ఉండేది. ఇవి భారత భూభాగంలో చాలా చిన్న చిన్న ప్రాంతాలు. అందుకే వీటిని నెహ్రూ ఒక సందర్భంలో ఫ్రెంచి కాలనీలు భారతదేశ ముఖముపై మొటిమలవలె ఉన్నాయి అని వ్యాఖ్యానించాడు.


1948 లో భారత్, ఫ్రెంచ్ ప్రభుత్వాలు ఈ ఐదు కాలనీల గురించి ఒక ఒప్పందం చేసుకున్నాయి. దీని ప్రకారం ఈ ఐదు ఫ్రెంచి కాలనీల భవిత రిఫరెండం ద్వారా (ప్రజలందరూ పాల్గొనే ప్రజాభిప్రాయం) నిర్ణయింపబడాలి. అంటే సామాన్య ఎన్నికల ద్వారా ప్రజలందరూ వారు భారతదేశంలో విలీనం చెందాల ఒద్దా అనే విషయాన్ని తెలియచేయాలన్నమాట. ( ఈ ప్రాంత ప్రజలందరూ భారతావనిలో కలసిపోవటానికి ఎగిరి గంతేస్తారని నెహ్రూ భావించారు. కానీ ఆతరువాత జరిగిన పరిణామాలు ఆయన అంచనాలను తప్పని నిరూపిస్తాయి. అందుచేతనే వీటి విలీనానికి 1954 వరకూ సమయం పట్టింది). ఈ ఒప్పందానికి అనుగుణంగా 19-06-1949 న అప్పటిదాక ఫ్రెంచ్ కాలనీగా ఉన్న చంద్రనాగూర్ రిఫరెండం జరుపుకొని భారతావనిలో విలీనమయిపోయింది. చంద్రనాగూర్లో జరిగినట్లు మిగతా కాలనీలలో జరగలేదు. ఈ కాలనీలలో తరువాత జరిగిన ఎలక్షన్లలో ఫ్రెంచిపాలన కొనసాగాలని కొరుకునే సొషలిస్టు పార్టీ ఘనవిజయం సాధించటంతో రిఫరెండం ప్రక్రియ అటకెక్కింది. ఆతరువాత ఈ కాలనీలలోని ప్రజలలో జాతీయ భావాలు బలపడి, స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని తెచ్చుకొని ఫ్రెంచిపాలనను అంతమొందించటానికి 1954 వరకు నిరీక్షించవలసి వచ్చింది.


1954 లో పాండిచేరి కి చెందిన శ్రీ గుబేర్, శ్రీ ముత్తుపిళ్లై, శ్రీ ముత్తుకుమరప్పరెడ్డియార్ల వంటి నాయకులు ఫ్రెంచి ప్రభుత్వాన్ని ధిక్కరించి బయటకు వచ్చి నెట్టుపాక్కం (పాండిచేరీకి చెందిన ఒక ఊరు) లో తాత్కాలిక సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. తరువాత ఫ్రెంచ్ ప్రభుత్వం దిగివచ్చి, 1-11-1954 న తన నాలుగు కాలనీలైన పాండిచేరీ, మాహే, కారైకాల్, యానం లను భారత ప్రభుత్వానికి డిఫాక్టోట్రాస్ఫ్వర్ చేసింది. (యధాతధ స్థితిలో బదలాయింపు).


యానం విమోచన నేపధ్యం

1948 మరియు 1951 లో యానంలో జరిగిన ఎలక్షన్లలో ఫ్రెంచి పాలనకు అనుకూలంగా ఉండే పార్టీల తరపున పోటీ చేసిన వారే విజయాలు సాధించటంతో ఇక్కడ ప్రజలలో విమోచన భావాలు తక్కువేనని చెప్పుకోవచ్చు. అంతేకాకఅన్నికోలనీలలోకెల్లా యానం ఫ్రెంచి వారికి పెట్టనికోట అని పెద్దపేరు తెచ్చుకుంది. 1951 లో జరిగిన ఎన్నికలలో నెగ్గిన ప్రముఖ నాయకులు ఈ విధంగా ఉన్నారు. శ్రీ మద్దింశెట్టి సత్యానందం, శ్రీ కనకాల తాతయ్య, శ్రీ దవులూరి వెంకట రాజారావు, శ్రీ గిరిమాధవరావు నాయుడు, శ్రీ నాటి చినవెంకన్న, శ్రీ కశిరెడ్డి బ్రహ్మానందం, శ్రీ కోన నరసయ్య, శ్రీ సమతం కృష్ణయ్య, శ్రీ పంపన వీరాస్వామి, శ్రీ గుర్రపు వెంకటరత్నం, శ్రీ జ్ఞానవేల్ నాచియప్పన్ మొదలగువారు. ఓడిపోయిన వారిలో ప్రముఖులు, శ్రీ కామిశెట్టి పరశురాం, శ్రీ యర్రా లక్ష్మణరావు లు ముఖ్యులు.


యానంలో 1947 నుంచి 1953 వరకూ ఫ్రెంచ్ ఇండియా పోరాట సంఘటనలు ఒకటి రెండు మినహా పెద్దగా ఏమీ జరుగవు. బహుసా అందుచేతనే ఫ్రెంచి వారు యానంను తమనిష్టపడే ప్రాంతంగా అభివర్ణించుకొనేవారు.

యానం విమోచనోద్యమానికి అంకురార్పణ

౧౯౫౪మార్చి మూడున యానంకు చెందిన జాతీయవాదులు, శ్రీ కామిశెట్టి పరశురాం అధ్యక్ష్యతన ఒక విలీన కూటమి గా ఏర్పడి యానంలో స్థానిక ఫ్రెంచ్ అధికారులు కొంతమంది స్వార్ధపరులైన ఫ్రెంచ్ విధేయులతో చేతులు కలిపి, జాతీయ భావాలున్న ప్రజలను భయాందోళనలకు, అణచివేతకు గురిచేస్తున్నారని అప్పటి ఫ్రెంచ్ గవర్నర్ అయిన శ్రీ మనార్డ్ గారికిచ్చిన టెలిగ్రాం లో ఆరోపించారు. ఈ ఉదంతంద్వారా యానాంలో ప్రజలకు ఫ్రెంచ్ వారిపట్ల అసంతృప్తి ఉన్నట్లు అర్ధంచేసుకోవచ్చు.


ఈ నేపధ్యంలో 1954 ఏప్రిల్ పదకొండవ తేదీ రాత్రి పాండిచేరి లోని భారత కౌంసిల్ జనరల్ శ్రీ కేవల్ సింగ్ ఆధ్వర్యంలో పాండిచేరీలోని జాతీయవాదులందరూ సమావేశమయ్యారు. ఫ్రెంచి వారి నుండి ఫ్రెంచ్ కాలనీలు విముక్తమవ్వాలంటే ఈ కాలనీలలో దేన్నో ఒక దానిని సంపూర్ణంగా చేజిక్కించుకోవటమే సరైన మార్గం అని శ్రీ కేవల్ సింగ్ ఆ సమావేశంలో అనగా ఆ విధంగా చేయటానికి ఎవరూ ముందుకు రారు. ఈ సమావేశానికి యానానికి చెంది, పాండిచేరీ స్వాతంత్ర్యపోరాటంలో ప్రధాన పాత్ర వహిస్తున్న శ్రీ దడాల రఫేల్ రమణయ్య కూడా అటెండ్ అయ్యారు. శ్రీ కేవల్ సింగ్ మాటలకు ఉత్తేజితుడైన శ్రీ దడాల యానాం లోని ఫ్రెంచి స్థావరాన్ని కైవసంచేసుకొని యానాన్ని ఫ్రెంచి పాలన నుండి విముక్తం చేయటానికై పాండిచేరీ నుండి బయలుదేరుతారు. ఆవిధంగా యానాం విమోచనోద్యమానికి ఏప్రిల్ పదకొండు 1954 న అంకురార్పణ జరిగిందని చెప్పుకోవచ్చు.


యానంలో ఉధ్యమభావాలు రగిల్చటం

1954, ఏప్రిల్ ఆరు న ఫ్రెంచ్ పాలనకొనసాగాలని యానాం మునిసిపల్ కౌంసిల్ లో తీర్మానం చేసుకున్నారు. ఈ తీర్మానాన్ని ఆధారంగా చేసుకుని యానం ఎడ్మినిష్ట్రేటర్ మరియు పాండిచేరీలోని ఫ్రెంచ్ అధికారులు - యానం ప్రజలందరూ ఫ్రెంచ్ పాలన కోరుకుంటున్నారనీ, వారంతా ఫ్రెంచ్ విధేయులనీ, ఇక్కడ జాతీయవాద ధోరణులు లేనే లేవనీ పెద్ద ప్రచారం చేసారు.


సరిగ్గా ఇటువంటి ప్రతికూల పరిస్థితులలో శ్రీ దడాల యానం వచ్చారు. యానాం చుట్టూ ఉన్న తూర్పుగోదావరి జిల్లా నాయకులను కలసుకొని, కాకినాడ టౌన్ హాలులో సభనేర్పాటుచేసి, గంభీరమైన ఉపన్యాసమిచ్చి అక్కడి పెద్దలను, యువతను ప్రేరేపించారు. ఇలా సంపాదించుకున్న కార్యకర్తలతో శ్రీ దడాల లారీలపై యానం వీధులలో తిరిగి, ఫ్రెంచ్ వ్యతిరేక వాతావరణాన్ని సృష్టించారు. యానంలో ఫ్రెంచ్ వ్యతిరేక వాతావరణం వస్తూండడంతో, ప్రభుత్వం కలవరపడసాగింది. ఫ్రెంచ్ విధేయులు యానంలో మీటింగులు పెట్టుకొని, ఫ్రెంచివారిపట్ల వారివిధేయతను ప్రకటించటమూ, శ్రీ దడాల దిష్టిబొమ్మను తగులపెట్టటము జరిగేది. ఇటువంటి పరిస్థితులలో శ్రీ దడాల యానం వంతెనకివతల ఆంధ్రా ప్రాంతంలో ఒక టెంటు వేసి, తన అనుచరులతో ఉంటూ, లౌడ్ స్పీకర్ల సహాయంతో విలీన అవసరతను తెలుపుతూ ఉండేవారు.


అప్పటి సామాజిక, రాజకీయ పరిస్థితులను గొడవలను ఈ ఉధ్యమమంలో పాల్గొన్న శ్రీ బొల్లోజు బసవలింగంగారు, 1954, అక్టోబరు ముప్పయవ తేదీ మాతృసేవ అనే పత్రిక లో విమోచనోధ్యమ విశేషాలు అనే వ్యాసం ద్వారా వివరించటం జరిగింది.


యానం విమోచనోద్యమం

శ్రీ దడాల రాక యానంలోని రాజకీయనాయకులలొ విలీనం పట్ల సానుకూల ధోరణి ఏర్పడటానికి తోడ్పడింది. మొదట్లో శ్రీ దడాల ఆంధ్రా నాయకులైన శ్రీ భయంకరాచారి, శ్రీ డి.ఎస్. ఆర్. సోమయాజులు, శ్రీ కొంపెను సుబ్బారావు, శ్రీ కస్తూరి సుబ్బారావు వంటి వారితో కలసి తన పోరాటాన్ని సాగించారు. వీరి ఆధ్వర్యంలో సభలు, పికెటింగులు, రాలీలు, రాస్తారోకోలు వంటివి జరపటంవల్ల క్రమక్రమంగా యానాం ప్రజలలో కూడా ఉద్యమభావాలు కలగటం ఫ్రెంచ్ వారి నుండి విమోచనం చెందాలన్న కోరిక ఉదయించటం జరిగింది.


ఈ సమయంలో శ్రీ జార్జి సాలా (అప్పటి యానాం అడ్మినిష్ట్రేటర్, ఫ్రెంచ్ దేశస్థుడు) ఫ్రెంచి వారికి అనుకూలంగా ఉంటూ, ఫ్రెంచి పాలన కొనసాగాలని ఆశించే యానం పౌరులను చేరదీసి వారి సహాయంతో విలీన వ్యతిరేక వాతావరణాన్ని సృష్టించటానికి ప్రయత్నించాడు. వీరిలో ముఖ్యులు శ్రీ సమతం కృష్ణయ్య, శ్రీ బస్సా సుబ్బారావు, శ్రీ కాపగంటి బులిమంగరాజు, శ్రీ బళ్లా, శ్రీ మహమద్ జిక్రియా తదితరులు ముఖ్యులు.

ఇరవైతొమ్మిది, ఏప్రిల్, 1954 న యానంకు చెందిన నాయకులు శ్రీ మద్దింశెట్టి, శ్రీ కామిశెట్టి, శ్రీ కోన, శ్రీ దవులూరి వెంకటరాజు తదితరులు తమ వేచిచూద్దం ధోరణిని విడనాడి, యానం భారతావనిలో విలీనం చెందాలన్న అవసరమును గుర్తించి ఈ విధంగా తీర్మానం చేసుకున్నారు. మా మాతృభూమి అయిన భారతావని పట్ల మేము సానుకూల ధోరణితో, దృఢంగా మమేకమైఉన్న కారణంగా, ఈ ప్రాంతపు (యానం) ఎన్నుకోబడిన నాయకులమైన మేము, భౌగోళికంగా, ఆర్ధికంగా, సాంస్కృతికంగా మాప్రాంతం భారతావనితో సారూప్యత కలిగిఉండటంచేత, ఈ ప్రాంతాన్ని రిఫరెండం లేకుండా భారతావనిలో తక్షణం విలీనం జరపాలని ఏకగ్రీవంగా కోరుచున్నాము. ఈ ప్రాంతాన్ని మా భారత మాతృభూమిలో కలుపుకోవటానికి అవసరమైన సత్వర చర్యలు చేపట్టాలని ఫ్రెంచ్ ప్రభుత్వాన్నికోరుతున్నాము. సత్వరమే స్పందించి మాబలీయమైన ఆశలను నిజంచేసి, ఫ్రాంస్, ఇండియాల స్నేహాన్ని బలోపేతంచేయవలసినదిగా, ఫ్రెంచ్ ప్రభుత్వ అధిపతియొక్క విజ్ఞతకు, రాజ నీతిజ్ఞతకు మేము విజ్ఞప్తి చేయుచున్నాము.

యానంకు చెందిన ప్రముఖ పౌరులు యానాన్ని భారతావనిలో విలీనం చేయాలని కోరుతూ చేసుకున్న ఈ తీర్మానాన్ని అప్పటి ప్రధాన మంత్రి, జవహర్ లాల్ నెహ్రూ కు, ఫ్రెంచ్ దేశ అసెంబ్లీ కి పంపించారు. దీని తదనంతరం జరిగిన అన్ని ఉద్యమ కార్యక్రమాలను వీరు శ్రీ దడాలతో కలసి సాగించారు.

శ్రీ మద్దింశెట్టి చర్యలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయన్న కారణం చూపి వారిని యానం మేయర్ పదవినుంచి ఫ్రెంచ్ ప్రభుత్వం తొలగించింది.


20-5-1954 న భారతపతాకాలు ధరించి అయిదువందల మంది కార్యకర్తలు యానం బ్రిడ్జి మీదుగా కదంతొక్కుతూ యానంవైపు కదిలారు. వీరికి నాయకులు శ్రీ దడాల, శ్రీ మద్దింశెట్టి, శ్రీ కామిశెట్టి, శ్రీ కనకాల, శ్రీ యర్రా, శ్రీ కస్తూరి సుబ్బారావు, శ్రీ పి. భయంకరాచారి తదితరులు. ఈ సంఘటనతో ఉద్యమకారుల బలం పతాకస్థాయిలో ప్రదర్శితమైనది.


ఈ పతాక ప్రదర్శనను విమోచన ఉద్యమకారులు చేసిన బలప్రదర్శనగా భావించిన ఉద్యమ వ్యతిరేక వాదులు ఉక్రోషంపట్టలేక ఉద్యమకారులపై దాడులను ముమ్మరం చేసారు. ఆ దాడులలో ప్రధానంగా చెప్పుకోవలసినది శ్రీ మద్దింశెట్టి ఇల్లు దోపిడీ. 23 -5-1954 న శ్రీ మద్దింశెట్టి ఇంటిపై విలీన వ్యతిరేక వాదులు, దాడిచేసి సుమారు 17 వేల రూపాయిల విలువచేసే నగలు, కొన్ని విలువైన పత్రాలు లూటీ చేసారు. వీరి తమ్ముడైన శ్రీ సత్తిరాజుగారి ఇంటిపై కూడా దాడిచేసి 20 వేలరూపాయిల నగలు ఇతర వస్తువులు లూటీ చేయటం జరిగింది. శ్రీ దడాల ఇంటి పై కూడా దాడి చేసారు. ఈ సంఘటనలకు అఘాయిత్యాలకు వెనుక సూత్రధారులు యానం జడ్జి శ్రీ గిర్మేన్ మరియు ఫ్రెంచ్ పోలీసు అధికారి శ్రీ బొర్నెట్ అని ఆరోపిస్తూ అప్పటి ఫ్రెంచ్ ఓవర్సీస్ మంత్రికి యానం నుంచి టెలిగ్రాములు వెళ్లినయ్ .


ఈ సంఘటనలపట్ల విచారణ జరపటానికై ఫ్రెంచ్ సెక్రటరీ జనరల్ శ్రీ ఎస్కర్గుయిల్ పర్యటించి, యానంలో గూండాల దాడులు జరిగాయని అంగీకరించి, శ్రీ మద్దింశెట్టి కి తగిన నష్టపరిహారం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. యానంలో ఉంటున్న ఫ్రెంచ్ దేశస్థులైన అధికారులకు రక్షణ ఉండదని భావించి, తనతో పాటు వారిని తీసుకుపోయారు.


యానం విమోచనం

యానాంలో దాడులు ప్రతిదాడుల తో పరిస్థితులు జఠిలమవుతూండడంతో శ్రీ జార్జి సాలా (యానం అడ్మినిష్ట్రేటర్ ) పాండిచేరీ వెళిపోయారు. ఆ భాధ్యతలను యానం జడ్జి, శ్రీ శివా స్వీకరించారు.


యానాన్ని ఫ్రెంచి పాలన నుండి విమోచనం కలిగించటానికి ఇదే సరైన సమయం అని ఉద్యమనాయకులు భావించారు. ఈ పోరాటనాయకుల రక్షణార్ధమూ మరియు హింసాత్మక ఘటనలు జరగకుండా చూసేందుకు, అప్పటి కాకినాడ కలెక్టరు గారు 200 సాయుధ బలగాలను రప్పించి వీరికి సహాయంగా ఉంచారు.


అది ఆదివారం జూన్ 13, 1954, ఆరోజు ఉదయాన్నె శ్రీ మద్దింశెట్టి సత్యానందం, శ్రీ కనకాల తాతయ్య, శ్రీ దడాల, శ్రీ యర్రా సత్యన్నారాయణమూర్తి, శ్రీ కామిశెట్టి పరశురాం, శ్రీ కోన నరసయ్య కాకినాడకు చెందిన శ్రీ పి. భయంకరాచారి మరియు ఓ వేయి మంది అనుచరులు ఒక సమూహంలా యానాంలోకి ప్రవేశించారు. ఫ్రెంచి పోలీసులు కొన్ని చేతి బాంబులను వీరివైపు విసిరారు. విమోచన ఉధ్యమ బృందంలో ఉన్న సాయుధ పోలీసులు అనేక రౌండ్ల కాల్పులు జరిపి, చాలా చాకచక్యంగా వ్యవహరించి, ఏ విధమైన పౌరనష్టం జరుగకుండా (ఈ సందర్భంలో) ఫ్రెంచ్ పోలీసులను నిర్వీర్యం చేసి నిరాయుధులను కావించారు. వీళ్ల రాక తెలుసుకొన్న ఫ్రెంచ్ విధేయ శక్తులు తలోదిక్కుకు పోయి దాక్కున్నారు.


ఆ విధంగా విమోచనోధ్యమకారులు అడ్మినిష్ట్రేటర్ బంగళాను చేరుకుని అప్పటి అడ్మినిష్ట్రేటర్ ఇంచార్జ్ శ్రీ శివా గారినుండి అధికారాలను స్వాధీన పరచుకున్నారు. శ్రీ శివా గారు పరిస్థితిని సమీక్షించి, ప్రతిఘటించినట్లైతే తలెత్తే శాంతిభద్రతల సమస్యను దూరాలోచన చేసి అధికారాలను బదలాయించారు. ఆ రోజే శ్రీ శివా పాండిచేరీకి ఈ విధంగా టెలిగ్రాం ఇచ్చారు:

ప్రజలు యానాం నిర్వహణను ఈనాడు ఉదయం 6 గంటలకు ప్రతిఘటన ఉన్నప్పటికీ స్వాధీనం చేసుకున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పుడు ప్రజల ఆధీనమై ఉన్నవి. ఎవరికీ ప్రాణహాని లేదు. కొందరు స్వల్పంగా గాయపడ్డారు. ప్రభుత్వోధ్యోగులకు యానంలో ఉండి పనిచేయటమా లేక పాండిచేరీ వెళ్లిపోవటమా అనే చాయిస్ (ఎంపిక) ఈయబడినది.

ఫ్రెంచి పాలనలో యానాం నుండి పాండిచేరీకి పంపబడ్డ ఆఖరు అధికారిక సమాచారం ఈ టెలిగ్రామే.

ఇదే అదునుగా భావించిన కొంతమంది అల్లరిమూకలు ఫ్రెంచ్ విధేయులైన శ్రి కాపగంటి, శ్రీ బాజీ, శ్రీ ఉమార్ ల ఆస్తులను, వ్యాపారాలను నాశనం చేయటం జరిగింది.


విలీన కార్యకర్తలు మరియు సివిల్ దుస్తులలొ ఉన్న కొంతమంది సాయుధ పోలీసులు యానం వీధులలో విజయోత్సాహంతో తిరిగారు. ఈ సమయంలో యానాం ఇంచార్జ్ మేయర్, సాహితీవేత్త, ఆయుర్వేద వైద్యుడు, ఫ్రెంచ్ విధేయుడు అయిన శ్రీ సమతం కృష్ణయ్య (78 ఏండ్లు) గారి వద్ద స్వీయరక్షణార్ధం ధరించిన పిస్తోలును చూసి, ఆయనే కాల్పులు జరపటానికి ప్రయత్నిస్తున్నారనే అనుమానంతో వారిని కాల్చి చంపటం జరిగింది. యానం విమోచనోద్యమం లొ అసువులు బాసింది ఈయనొక్కరే.


ఉద్యమకారులు జాతిపిత గాంధీజీ మరియు పండిట్ నెహ్రూల చిత్రపటాలను అలంకరించి పట్టణ విధులలో ఊరేగింపు జరిపారు. ఆ తరువాత జరిగిన బహిరంగ సభలో శ్రీ మద్దింశెట్టి మాట్లాడుతూ యానంవిమోచనమైనదనీ, భారతప్రభుత్వం దీని పాలన చేపట్టి, ఈ ప్రాంతమును రిఫరెండం లేకుండా భారతావనిలో విలీనం చేసుకోవాలని కోరారు. ఆ రోజు మధ్యాహ్నం శ్రీ దడాల అడ్మినిష్ట్రేటర్ గా భాధ్యతలు స్వీకరించారు. శ్రీమద్దింశెట్టి ప్రెసిడెంటుగా, శ్రీకనకాల వైస్ ప్రెసిడెంటుగా, శ్రీ కామిశెట్టి, శ్రీ యర్రా సత్యన్నారాయణమూర్తి మరియు శ్రీ కోనలు సభ్యులుగా పాలక మండలి ఏర్పడి భాధ్యతలు చేపట్టారు. చిన్నాభిన్నమైన శాంతిభద్రతలను తిరిగి స్థాపించటంలో ఈ పాలక వర్గం ఎంతో కృషి చేసింది.


అలా ఉద్యమకారులచే జరపబడిన యానం విమోచనం గురించి ఆలిండియా రేడియోమరియు పత్రికలు ప్రకటించాయి. 27, జూన్ 1954 లో యానాం ప్రజలు విమోచన వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు. ఇరవై ఒక్క తుపాకుల కాల్పుల అనంతరం శ్రీ మద్దింశెట్టి సత్యానందం ఫ్రెంచ్ పతాకాన్ని అవనతం చేసి భారత పతాకాన్ని ఎగురవేసారు. ఈ వేడుకలలో యానాం ప్రజలేకాక పరిసర ప్రాంతాలైన నీలపల్లి, జార్జీపేట, కాపులపాలెం లకు చెందిన ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆవిధంగా సుమారు 2 శతాబ్ధాల ఫ్రెంచ్ పాలనకు తెరపడింది.


సంక్షిప్తీకరించబడిన పై అంశాలేకాక ఈ పుస్తకంలో

1. విమోచనము, డీఫాక్టో ట్రాంస్వర్, డిజ్యూర్ ట్రాంస్వర్ ట్రీటీ ఆఫ్ సిషం, మరియు విలీనము వంటి పదాల వివరణలు

2. అప్పటి విమోచన ఉధ్యమకారుల అనుభవాలు, జ్ఞాపకాలు

3. యానం విమోచనంపై భిన్నకోణాల విశ్లేషణ, డా.నల్లంగారి ఇంటర్వ్యూ, శ్రీ జార్జి సాలా జ్ఞాపకాలు అంటు వ్రాసిన వ్యాసానువాదం,

4. శ్రీ ఎస్కర్గుయిల్ నివేదిక పూర్తి సారాంశం

5. యానాం విమోచనంలో భారత సైనికుల పాత్ర, దానిపై వచ్చిన విమర్శలు, దానికి సంబందించి నెహ్రూ అప్పటి ఆంధ్రా నాయకులైన శ్రీ సంజీవ రెడ్డి కి వ్రాసిన లేఖ అనువాదం

6. విమోచనంజరిగిన మరునాడు హిందూలో వచ్చిన వార్తలో ఉన్న నిజానిజాల విశ్లేషణ 7. యానాం విమోచనం పై పాండిచేరీ నాయకుల స్పందన, అప్పటి ఫ్రెంచ్ ప త్రికలలో యానాం విమోచనవార్తా కధనాలు

8. యానాంలో ఫ్రెంచ్ పాలన మిగిల్చిన ఆనవాళ్లు

9. ఆనాటి నాయకుల దార్శనికత.

10. అప్పటి ప్రముఖుల జీవితచిత్రణలు, మరియు అప్పటి చాయాచిత్రమాలిక లో ౩౩ అరుదైన చిత్రాలతో ఈ పుస్తకం ఉంటుంది.


పేజీల సంఖ్య: 125 వెల : 50 రూపాయిలు.
కాంటాక్ట్: ప్రొఫైల్ లో ఉన్నా నా మెయిల్ ఇది కి మెయిల్ చెయ్యండి