Tuesday, May 6, 2008

యానాం విమోచనొద్యమం





ఉపోద్ఘాతం

సుమారు రెండు శతాబ్దాల ఫ్రెంచ్ పాలన నుండి యానం పదమూడు జూన్ పంతొ్మ్మిదివందల యాభైనాలుగున విమోచనం చెందింది. ఈ కాలంలోనే ఫ్రెంచి వారి వలస పాలన నుండి ఇండోచైనా విమోచనం చెందటానికి ఘోరమైన యుద్దం చేయవలసి వచ్చింది. కానీ భారత దేశంలోని ఫ్రెంచి కాలనీల విమోచనం చర్చల ద్వారా, అహింసాయుత పద్దతుల ద్వారా, రాజకీయ ఎత్తుగడలతో జరిగింది. అప్పటికి మిగిలున్న నాలుగు ఫ్రెంచి కాలనీలైన పాండిచేరీ, మాహే, కారైకాల్ మరియు యానాంలలో, యానామే మొదటగా విమోచనం చెందినట్లుగా ప్రకటించుకుంది. ఇది తెలుగు వారమైన మన అందరికీ గర్వకారణమే ఎందుకంటే ఇలా జరగటం వల్ల యానాం ఓ క్రాంతదర్శి గా చరిత్ర కెక్కింది.


అప్పటి కాలమాన పరిస్థితుల దృష్ట్యా యానాం విమోచనం భిన్న కోణాలలో ఈ విధంగా దర్శించబడ్డది.


1. విమోచన ఉద్యమకారుల దృష్టిలో యానాం విమోచనమనేది ఫ్రెంచి పాలనా దాశ్య సృంఖలాలనుండి విముక్తమై స్వాతంత్ర్య భారతావనిలో విలీనం కావటానికి జరిపిన మహోద్యమము.

2. భారత ప్రభుత్వము యానం విమోచనాన్ని స్వాగతించదగిన దురదృష్టకరమైన సంఘటనగా అభివర్ణించింది.

3. భారత ప్రభుత్వం తన దేశ భక్తులతో చేయించిన ముట్టడిగా దీన్ని ఫ్రెంచి ప్రభుత్వం భావించింది.

4. యానం నాయకులు ఆంధ్రా ప్రజలతో కలసి ఫ్రెంచి వారినుండి అధికారాలను చేజిక్కించుకొని యానం విమోచనం చెందిందని ప్రకటించారని కొంతమంది స్థానికులు భావించారు.


ఏ వాదన ఎలా సాగినా యానం ఫ్రెంచి పాలన నుండి విమోచనం చెంది భారతావనిలో విలీనం చెందటం అనేది అప్పటికి ఒక చారిత్రక అవసరం. ఈ మహత్కార్యాన్ని భుజాన వేసుకొని ఉద్యమాన్ని నడిపించిన నాయకుల దేశభక్తిని శంకించలేము. వారు ఈ ఉద్యమాన్ని శాంతియుత, ప్రజాస్వామ్యయుతంగా నడిపించిన తీరు అనన్యమైనది. భారత్-ఫ్రెంచ్ కాలనీల చరిత్రలోనే ఒక మైలు రాయిగా నిలచిన యానాం విమోచనమును జరిపించిన ఆనాటి నాయకుల దార్శనికత అత్యంత ఉన్నతమైనది.


విమోచనమంటే ఉన్నపళంగా బయటకు వచ్చేసి, మనల్ని మనం పునర్నింమిచుకోవటమే అని జేన్ ఫాండా అనే అమెరికన్ రచయిత్రి అంటుంది. ఫ్రెంచి ప్రభుత్వం స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే తన మూడు సూత్రాలకు అనుగుణంగా ఈ కాలనీల పరిపాలన సాగించటంవలన ఈ ప్రాంత ప్రజలు ఫ్రెంచి వారి పట్ల మమకారాన్ని ఏర్పరచుకున్నారు. తమపొరుగు ప్రాంతంలో బ్రిటీష్ వారు సాగించిన దుష్టపాలన, ఈ కాలనీల వాసులలో ఫ్రెంచి వారిపట్ల ప్రేమను బలోపేతం చేసింది. అందుచేత తరతరాలుగా జీర్ణించుకున్న ఫ్రెంచ్ సంస్కృతి పట్ల తమకున్న విధేయతనుంచి ఉన్నపళంగా బయటకు వచ్చేయడం కొంతమందికి అంత సులువు కాలేదు. కనుక ఆ తరంలోని కొంతమందికి తమ ఫ్రెంచి విధేయతకు, మారుతున్న రాజకీయ పరిస్థితులకు మద్య సంఘర్షణను ఎదుర్కోవలసి వచ్చింది. ఆఘర్షణ ఫలితమే యానంలో జరిగిన విమోచనోద్యమము.


ఫ్రెంచ్ కాలనీల విమోచన నేపధ్యం

1947 లో బ్రిటిష్ వారు భారత భూభాగాన్ని విడిచిపెట్టిపోవడంతో ఫ్రెంచ్ కాలనీలలోని ప్రజలలో కూడా భారత జాతీయవాద ధోరణుల తీవ్రత పెరిగింది. అప్పటికి పాండిచేరీ, కారైకాల్, మాహే, యానం మరియు చంద్రనాగూర్ అనే అయిదు ప్రాంతాలు ఫ్రెంఛి వారి ఆధీనంలో ఉన్నాయి. ఈ అయిదు ప్రాంతాలు భౌగోళికంగా దూరదూరంగా, సాంస్కృతికంగా భిన్నంగా ఉండటం వలన వీటిని నియంత్రించటం ఫ్రెంచి వారికి కష్టంగా ఉండేది. ఇవి భారత భూభాగంలో చాలా చిన్న చిన్న ప్రాంతాలు. అందుకే వీటిని నెహ్రూ ఒక సందర్భంలో ఫ్రెంచి కాలనీలు భారతదేశ ముఖముపై మొటిమలవలె ఉన్నాయి అని వ్యాఖ్యానించాడు.


1948 లో భారత్, ఫ్రెంచ్ ప్రభుత్వాలు ఈ ఐదు కాలనీల గురించి ఒక ఒప్పందం చేసుకున్నాయి. దీని ప్రకారం ఈ ఐదు ఫ్రెంచి కాలనీల భవిత రిఫరెండం ద్వారా (ప్రజలందరూ పాల్గొనే ప్రజాభిప్రాయం) నిర్ణయింపబడాలి. అంటే సామాన్య ఎన్నికల ద్వారా ప్రజలందరూ వారు భారతదేశంలో విలీనం చెందాల ఒద్దా అనే విషయాన్ని తెలియచేయాలన్నమాట. ( ఈ ప్రాంత ప్రజలందరూ భారతావనిలో కలసిపోవటానికి ఎగిరి గంతేస్తారని నెహ్రూ భావించారు. కానీ ఆతరువాత జరిగిన పరిణామాలు ఆయన అంచనాలను తప్పని నిరూపిస్తాయి. అందుచేతనే వీటి విలీనానికి 1954 వరకూ సమయం పట్టింది). ఈ ఒప్పందానికి అనుగుణంగా 19-06-1949 న అప్పటిదాక ఫ్రెంచ్ కాలనీగా ఉన్న చంద్రనాగూర్ రిఫరెండం జరుపుకొని భారతావనిలో విలీనమయిపోయింది. చంద్రనాగూర్లో జరిగినట్లు మిగతా కాలనీలలో జరగలేదు. ఈ కాలనీలలో తరువాత జరిగిన ఎలక్షన్లలో ఫ్రెంచిపాలన కొనసాగాలని కొరుకునే సొషలిస్టు పార్టీ ఘనవిజయం సాధించటంతో రిఫరెండం ప్రక్రియ అటకెక్కింది. ఆతరువాత ఈ కాలనీలలోని ప్రజలలో జాతీయ భావాలు బలపడి, స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని తెచ్చుకొని ఫ్రెంచిపాలనను అంతమొందించటానికి 1954 వరకు నిరీక్షించవలసి వచ్చింది.


1954 లో పాండిచేరి కి చెందిన శ్రీ గుబేర్, శ్రీ ముత్తుపిళ్లై, శ్రీ ముత్తుకుమరప్పరెడ్డియార్ల వంటి నాయకులు ఫ్రెంచి ప్రభుత్వాన్ని ధిక్కరించి బయటకు వచ్చి నెట్టుపాక్కం (పాండిచేరీకి చెందిన ఒక ఊరు) లో తాత్కాలిక సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. తరువాత ఫ్రెంచ్ ప్రభుత్వం దిగివచ్చి, 1-11-1954 న తన నాలుగు కాలనీలైన పాండిచేరీ, మాహే, కారైకాల్, యానం లను భారత ప్రభుత్వానికి డిఫాక్టోట్రాస్ఫ్వర్ చేసింది. (యధాతధ స్థితిలో బదలాయింపు).


యానం విమోచన నేపధ్యం

1948 మరియు 1951 లో యానంలో జరిగిన ఎలక్షన్లలో ఫ్రెంచి పాలనకు అనుకూలంగా ఉండే పార్టీల తరపున పోటీ చేసిన వారే విజయాలు సాధించటంతో ఇక్కడ ప్రజలలో విమోచన భావాలు తక్కువేనని చెప్పుకోవచ్చు. అంతేకాకఅన్నికోలనీలలోకెల్లా యానం ఫ్రెంచి వారికి పెట్టనికోట అని పెద్దపేరు తెచ్చుకుంది. 1951 లో జరిగిన ఎన్నికలలో నెగ్గిన ప్రముఖ నాయకులు ఈ విధంగా ఉన్నారు. శ్రీ మద్దింశెట్టి సత్యానందం, శ్రీ కనకాల తాతయ్య, శ్రీ దవులూరి వెంకట రాజారావు, శ్రీ గిరిమాధవరావు నాయుడు, శ్రీ నాటి చినవెంకన్న, శ్రీ కశిరెడ్డి బ్రహ్మానందం, శ్రీ కోన నరసయ్య, శ్రీ సమతం కృష్ణయ్య, శ్రీ పంపన వీరాస్వామి, శ్రీ గుర్రపు వెంకటరత్నం, శ్రీ జ్ఞానవేల్ నాచియప్పన్ మొదలగువారు. ఓడిపోయిన వారిలో ప్రముఖులు, శ్రీ కామిశెట్టి పరశురాం, శ్రీ యర్రా లక్ష్మణరావు లు ముఖ్యులు.


యానంలో 1947 నుంచి 1953 వరకూ ఫ్రెంచ్ ఇండియా పోరాట సంఘటనలు ఒకటి రెండు మినహా పెద్దగా ఏమీ జరుగవు. బహుసా అందుచేతనే ఫ్రెంచి వారు యానంను తమనిష్టపడే ప్రాంతంగా అభివర్ణించుకొనేవారు.

యానం విమోచనోద్యమానికి అంకురార్పణ

౧౯౫౪మార్చి మూడున యానంకు చెందిన జాతీయవాదులు, శ్రీ కామిశెట్టి పరశురాం అధ్యక్ష్యతన ఒక విలీన కూటమి గా ఏర్పడి యానంలో స్థానిక ఫ్రెంచ్ అధికారులు కొంతమంది స్వార్ధపరులైన ఫ్రెంచ్ విధేయులతో చేతులు కలిపి, జాతీయ భావాలున్న ప్రజలను భయాందోళనలకు, అణచివేతకు గురిచేస్తున్నారని అప్పటి ఫ్రెంచ్ గవర్నర్ అయిన శ్రీ మనార్డ్ గారికిచ్చిన టెలిగ్రాం లో ఆరోపించారు. ఈ ఉదంతంద్వారా యానాంలో ప్రజలకు ఫ్రెంచ్ వారిపట్ల అసంతృప్తి ఉన్నట్లు అర్ధంచేసుకోవచ్చు.


ఈ నేపధ్యంలో 1954 ఏప్రిల్ పదకొండవ తేదీ రాత్రి పాండిచేరి లోని భారత కౌంసిల్ జనరల్ శ్రీ కేవల్ సింగ్ ఆధ్వర్యంలో పాండిచేరీలోని జాతీయవాదులందరూ సమావేశమయ్యారు. ఫ్రెంచి వారి నుండి ఫ్రెంచ్ కాలనీలు విముక్తమవ్వాలంటే ఈ కాలనీలలో దేన్నో ఒక దానిని సంపూర్ణంగా చేజిక్కించుకోవటమే సరైన మార్గం అని శ్రీ కేవల్ సింగ్ ఆ సమావేశంలో అనగా ఆ విధంగా చేయటానికి ఎవరూ ముందుకు రారు. ఈ సమావేశానికి యానానికి చెంది, పాండిచేరీ స్వాతంత్ర్యపోరాటంలో ప్రధాన పాత్ర వహిస్తున్న శ్రీ దడాల రఫేల్ రమణయ్య కూడా అటెండ్ అయ్యారు. శ్రీ కేవల్ సింగ్ మాటలకు ఉత్తేజితుడైన శ్రీ దడాల యానాం లోని ఫ్రెంచి స్థావరాన్ని కైవసంచేసుకొని యానాన్ని ఫ్రెంచి పాలన నుండి విముక్తం చేయటానికై పాండిచేరీ నుండి బయలుదేరుతారు. ఆవిధంగా యానాం విమోచనోద్యమానికి ఏప్రిల్ పదకొండు 1954 న అంకురార్పణ జరిగిందని చెప్పుకోవచ్చు.


యానంలో ఉధ్యమభావాలు రగిల్చటం

1954, ఏప్రిల్ ఆరు న ఫ్రెంచ్ పాలనకొనసాగాలని యానాం మునిసిపల్ కౌంసిల్ లో తీర్మానం చేసుకున్నారు. ఈ తీర్మానాన్ని ఆధారంగా చేసుకుని యానం ఎడ్మినిష్ట్రేటర్ మరియు పాండిచేరీలోని ఫ్రెంచ్ అధికారులు - యానం ప్రజలందరూ ఫ్రెంచ్ పాలన కోరుకుంటున్నారనీ, వారంతా ఫ్రెంచ్ విధేయులనీ, ఇక్కడ జాతీయవాద ధోరణులు లేనే లేవనీ పెద్ద ప్రచారం చేసారు.


సరిగ్గా ఇటువంటి ప్రతికూల పరిస్థితులలో శ్రీ దడాల యానం వచ్చారు. యానాం చుట్టూ ఉన్న తూర్పుగోదావరి జిల్లా నాయకులను కలసుకొని, కాకినాడ టౌన్ హాలులో సభనేర్పాటుచేసి, గంభీరమైన ఉపన్యాసమిచ్చి అక్కడి పెద్దలను, యువతను ప్రేరేపించారు. ఇలా సంపాదించుకున్న కార్యకర్తలతో శ్రీ దడాల లారీలపై యానం వీధులలో తిరిగి, ఫ్రెంచ్ వ్యతిరేక వాతావరణాన్ని సృష్టించారు. యానంలో ఫ్రెంచ్ వ్యతిరేక వాతావరణం వస్తూండడంతో, ప్రభుత్వం కలవరపడసాగింది. ఫ్రెంచ్ విధేయులు యానంలో మీటింగులు పెట్టుకొని, ఫ్రెంచివారిపట్ల వారివిధేయతను ప్రకటించటమూ, శ్రీ దడాల దిష్టిబొమ్మను తగులపెట్టటము జరిగేది. ఇటువంటి పరిస్థితులలో శ్రీ దడాల యానం వంతెనకివతల ఆంధ్రా ప్రాంతంలో ఒక టెంటు వేసి, తన అనుచరులతో ఉంటూ, లౌడ్ స్పీకర్ల సహాయంతో విలీన అవసరతను తెలుపుతూ ఉండేవారు.


అప్పటి సామాజిక, రాజకీయ పరిస్థితులను గొడవలను ఈ ఉధ్యమమంలో పాల్గొన్న శ్రీ బొల్లోజు బసవలింగంగారు, 1954, అక్టోబరు ముప్పయవ తేదీ మాతృసేవ అనే పత్రిక లో విమోచనోధ్యమ విశేషాలు అనే వ్యాసం ద్వారా వివరించటం జరిగింది.


యానం విమోచనోద్యమం

శ్రీ దడాల రాక యానంలోని రాజకీయనాయకులలొ విలీనం పట్ల సానుకూల ధోరణి ఏర్పడటానికి తోడ్పడింది. మొదట్లో శ్రీ దడాల ఆంధ్రా నాయకులైన శ్రీ భయంకరాచారి, శ్రీ డి.ఎస్. ఆర్. సోమయాజులు, శ్రీ కొంపెను సుబ్బారావు, శ్రీ కస్తూరి సుబ్బారావు వంటి వారితో కలసి తన పోరాటాన్ని సాగించారు. వీరి ఆధ్వర్యంలో సభలు, పికెటింగులు, రాలీలు, రాస్తారోకోలు వంటివి జరపటంవల్ల క్రమక్రమంగా యానాం ప్రజలలో కూడా ఉద్యమభావాలు కలగటం ఫ్రెంచ్ వారి నుండి విమోచనం చెందాలన్న కోరిక ఉదయించటం జరిగింది.


ఈ సమయంలో శ్రీ జార్జి సాలా (అప్పటి యానాం అడ్మినిష్ట్రేటర్, ఫ్రెంచ్ దేశస్థుడు) ఫ్రెంచి వారికి అనుకూలంగా ఉంటూ, ఫ్రెంచి పాలన కొనసాగాలని ఆశించే యానం పౌరులను చేరదీసి వారి సహాయంతో విలీన వ్యతిరేక వాతావరణాన్ని సృష్టించటానికి ప్రయత్నించాడు. వీరిలో ముఖ్యులు శ్రీ సమతం కృష్ణయ్య, శ్రీ బస్సా సుబ్బారావు, శ్రీ కాపగంటి బులిమంగరాజు, శ్రీ బళ్లా, శ్రీ మహమద్ జిక్రియా తదితరులు ముఖ్యులు.

ఇరవైతొమ్మిది, ఏప్రిల్, 1954 న యానంకు చెందిన నాయకులు శ్రీ మద్దింశెట్టి, శ్రీ కామిశెట్టి, శ్రీ కోన, శ్రీ దవులూరి వెంకటరాజు తదితరులు తమ వేచిచూద్దం ధోరణిని విడనాడి, యానం భారతావనిలో విలీనం చెందాలన్న అవసరమును గుర్తించి ఈ విధంగా తీర్మానం చేసుకున్నారు. మా మాతృభూమి అయిన భారతావని పట్ల మేము సానుకూల ధోరణితో, దృఢంగా మమేకమైఉన్న కారణంగా, ఈ ప్రాంతపు (యానం) ఎన్నుకోబడిన నాయకులమైన మేము, భౌగోళికంగా, ఆర్ధికంగా, సాంస్కృతికంగా మాప్రాంతం భారతావనితో సారూప్యత కలిగిఉండటంచేత, ఈ ప్రాంతాన్ని రిఫరెండం లేకుండా భారతావనిలో తక్షణం విలీనం జరపాలని ఏకగ్రీవంగా కోరుచున్నాము. ఈ ప్రాంతాన్ని మా భారత మాతృభూమిలో కలుపుకోవటానికి అవసరమైన సత్వర చర్యలు చేపట్టాలని ఫ్రెంచ్ ప్రభుత్వాన్నికోరుతున్నాము. సత్వరమే స్పందించి మాబలీయమైన ఆశలను నిజంచేసి, ఫ్రాంస్, ఇండియాల స్నేహాన్ని బలోపేతంచేయవలసినదిగా, ఫ్రెంచ్ ప్రభుత్వ అధిపతియొక్క విజ్ఞతకు, రాజ నీతిజ్ఞతకు మేము విజ్ఞప్తి చేయుచున్నాము.

యానంకు చెందిన ప్రముఖ పౌరులు యానాన్ని భారతావనిలో విలీనం చేయాలని కోరుతూ చేసుకున్న ఈ తీర్మానాన్ని అప్పటి ప్రధాన మంత్రి, జవహర్ లాల్ నెహ్రూ కు, ఫ్రెంచ్ దేశ అసెంబ్లీ కి పంపించారు. దీని తదనంతరం జరిగిన అన్ని ఉద్యమ కార్యక్రమాలను వీరు శ్రీ దడాలతో కలసి సాగించారు.

శ్రీ మద్దింశెట్టి చర్యలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయన్న కారణం చూపి వారిని యానం మేయర్ పదవినుంచి ఫ్రెంచ్ ప్రభుత్వం తొలగించింది.


20-5-1954 న భారతపతాకాలు ధరించి అయిదువందల మంది కార్యకర్తలు యానం బ్రిడ్జి మీదుగా కదంతొక్కుతూ యానంవైపు కదిలారు. వీరికి నాయకులు శ్రీ దడాల, శ్రీ మద్దింశెట్టి, శ్రీ కామిశెట్టి, శ్రీ కనకాల, శ్రీ యర్రా, శ్రీ కస్తూరి సుబ్బారావు, శ్రీ పి. భయంకరాచారి తదితరులు. ఈ సంఘటనతో ఉద్యమకారుల బలం పతాకస్థాయిలో ప్రదర్శితమైనది.


ఈ పతాక ప్రదర్శనను విమోచన ఉద్యమకారులు చేసిన బలప్రదర్శనగా భావించిన ఉద్యమ వ్యతిరేక వాదులు ఉక్రోషంపట్టలేక ఉద్యమకారులపై దాడులను ముమ్మరం చేసారు. ఆ దాడులలో ప్రధానంగా చెప్పుకోవలసినది శ్రీ మద్దింశెట్టి ఇల్లు దోపిడీ. 23 -5-1954 న శ్రీ మద్దింశెట్టి ఇంటిపై విలీన వ్యతిరేక వాదులు, దాడిచేసి సుమారు 17 వేల రూపాయిల విలువచేసే నగలు, కొన్ని విలువైన పత్రాలు లూటీ చేసారు. వీరి తమ్ముడైన శ్రీ సత్తిరాజుగారి ఇంటిపై కూడా దాడిచేసి 20 వేలరూపాయిల నగలు ఇతర వస్తువులు లూటీ చేయటం జరిగింది. శ్రీ దడాల ఇంటి పై కూడా దాడి చేసారు. ఈ సంఘటనలకు అఘాయిత్యాలకు వెనుక సూత్రధారులు యానం జడ్జి శ్రీ గిర్మేన్ మరియు ఫ్రెంచ్ పోలీసు అధికారి శ్రీ బొర్నెట్ అని ఆరోపిస్తూ అప్పటి ఫ్రెంచ్ ఓవర్సీస్ మంత్రికి యానం నుంచి టెలిగ్రాములు వెళ్లినయ్ .


ఈ సంఘటనలపట్ల విచారణ జరపటానికై ఫ్రెంచ్ సెక్రటరీ జనరల్ శ్రీ ఎస్కర్గుయిల్ పర్యటించి, యానంలో గూండాల దాడులు జరిగాయని అంగీకరించి, శ్రీ మద్దింశెట్టి కి తగిన నష్టపరిహారం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. యానంలో ఉంటున్న ఫ్రెంచ్ దేశస్థులైన అధికారులకు రక్షణ ఉండదని భావించి, తనతో పాటు వారిని తీసుకుపోయారు.


యానం విమోచనం

యానాంలో దాడులు ప్రతిదాడుల తో పరిస్థితులు జఠిలమవుతూండడంతో శ్రీ జార్జి సాలా (యానం అడ్మినిష్ట్రేటర్ ) పాండిచేరీ వెళిపోయారు. ఆ భాధ్యతలను యానం జడ్జి, శ్రీ శివా స్వీకరించారు.


యానాన్ని ఫ్రెంచి పాలన నుండి విమోచనం కలిగించటానికి ఇదే సరైన సమయం అని ఉద్యమనాయకులు భావించారు. ఈ పోరాటనాయకుల రక్షణార్ధమూ మరియు హింసాత్మక ఘటనలు జరగకుండా చూసేందుకు, అప్పటి కాకినాడ కలెక్టరు గారు 200 సాయుధ బలగాలను రప్పించి వీరికి సహాయంగా ఉంచారు.


అది ఆదివారం జూన్ 13, 1954, ఆరోజు ఉదయాన్నె శ్రీ మద్దింశెట్టి సత్యానందం, శ్రీ కనకాల తాతయ్య, శ్రీ దడాల, శ్రీ యర్రా సత్యన్నారాయణమూర్తి, శ్రీ కామిశెట్టి పరశురాం, శ్రీ కోన నరసయ్య కాకినాడకు చెందిన శ్రీ పి. భయంకరాచారి మరియు ఓ వేయి మంది అనుచరులు ఒక సమూహంలా యానాంలోకి ప్రవేశించారు. ఫ్రెంచి పోలీసులు కొన్ని చేతి బాంబులను వీరివైపు విసిరారు. విమోచన ఉధ్యమ బృందంలో ఉన్న సాయుధ పోలీసులు అనేక రౌండ్ల కాల్పులు జరిపి, చాలా చాకచక్యంగా వ్యవహరించి, ఏ విధమైన పౌరనష్టం జరుగకుండా (ఈ సందర్భంలో) ఫ్రెంచ్ పోలీసులను నిర్వీర్యం చేసి నిరాయుధులను కావించారు. వీళ్ల రాక తెలుసుకొన్న ఫ్రెంచ్ విధేయ శక్తులు తలోదిక్కుకు పోయి దాక్కున్నారు.


ఆ విధంగా విమోచనోధ్యమకారులు అడ్మినిష్ట్రేటర్ బంగళాను చేరుకుని అప్పటి అడ్మినిష్ట్రేటర్ ఇంచార్జ్ శ్రీ శివా గారినుండి అధికారాలను స్వాధీన పరచుకున్నారు. శ్రీ శివా గారు పరిస్థితిని సమీక్షించి, ప్రతిఘటించినట్లైతే తలెత్తే శాంతిభద్రతల సమస్యను దూరాలోచన చేసి అధికారాలను బదలాయించారు. ఆ రోజే శ్రీ శివా పాండిచేరీకి ఈ విధంగా టెలిగ్రాం ఇచ్చారు:

ప్రజలు యానాం నిర్వహణను ఈనాడు ఉదయం 6 గంటలకు ప్రతిఘటన ఉన్నప్పటికీ స్వాధీనం చేసుకున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పుడు ప్రజల ఆధీనమై ఉన్నవి. ఎవరికీ ప్రాణహాని లేదు. కొందరు స్వల్పంగా గాయపడ్డారు. ప్రభుత్వోధ్యోగులకు యానంలో ఉండి పనిచేయటమా లేక పాండిచేరీ వెళ్లిపోవటమా అనే చాయిస్ (ఎంపిక) ఈయబడినది.

ఫ్రెంచి పాలనలో యానాం నుండి పాండిచేరీకి పంపబడ్డ ఆఖరు అధికారిక సమాచారం ఈ టెలిగ్రామే.

ఇదే అదునుగా భావించిన కొంతమంది అల్లరిమూకలు ఫ్రెంచ్ విధేయులైన శ్రి కాపగంటి, శ్రీ బాజీ, శ్రీ ఉమార్ ల ఆస్తులను, వ్యాపారాలను నాశనం చేయటం జరిగింది.


విలీన కార్యకర్తలు మరియు సివిల్ దుస్తులలొ ఉన్న కొంతమంది సాయుధ పోలీసులు యానం వీధులలో విజయోత్సాహంతో తిరిగారు. ఈ సమయంలో యానాం ఇంచార్జ్ మేయర్, సాహితీవేత్త, ఆయుర్వేద వైద్యుడు, ఫ్రెంచ్ విధేయుడు అయిన శ్రీ సమతం కృష్ణయ్య (78 ఏండ్లు) గారి వద్ద స్వీయరక్షణార్ధం ధరించిన పిస్తోలును చూసి, ఆయనే కాల్పులు జరపటానికి ప్రయత్నిస్తున్నారనే అనుమానంతో వారిని కాల్చి చంపటం జరిగింది. యానం విమోచనోద్యమం లొ అసువులు బాసింది ఈయనొక్కరే.


ఉద్యమకారులు జాతిపిత గాంధీజీ మరియు పండిట్ నెహ్రూల చిత్రపటాలను అలంకరించి పట్టణ విధులలో ఊరేగింపు జరిపారు. ఆ తరువాత జరిగిన బహిరంగ సభలో శ్రీ మద్దింశెట్టి మాట్లాడుతూ యానంవిమోచనమైనదనీ, భారతప్రభుత్వం దీని పాలన చేపట్టి, ఈ ప్రాంతమును రిఫరెండం లేకుండా భారతావనిలో విలీనం చేసుకోవాలని కోరారు. ఆ రోజు మధ్యాహ్నం శ్రీ దడాల అడ్మినిష్ట్రేటర్ గా భాధ్యతలు స్వీకరించారు. శ్రీమద్దింశెట్టి ప్రెసిడెంటుగా, శ్రీకనకాల వైస్ ప్రెసిడెంటుగా, శ్రీ కామిశెట్టి, శ్రీ యర్రా సత్యన్నారాయణమూర్తి మరియు శ్రీ కోనలు సభ్యులుగా పాలక మండలి ఏర్పడి భాధ్యతలు చేపట్టారు. చిన్నాభిన్నమైన శాంతిభద్రతలను తిరిగి స్థాపించటంలో ఈ పాలక వర్గం ఎంతో కృషి చేసింది.


అలా ఉద్యమకారులచే జరపబడిన యానం విమోచనం గురించి ఆలిండియా రేడియోమరియు పత్రికలు ప్రకటించాయి. 27, జూన్ 1954 లో యానాం ప్రజలు విమోచన వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు. ఇరవై ఒక్క తుపాకుల కాల్పుల అనంతరం శ్రీ మద్దింశెట్టి సత్యానందం ఫ్రెంచ్ పతాకాన్ని అవనతం చేసి భారత పతాకాన్ని ఎగురవేసారు. ఈ వేడుకలలో యానాం ప్రజలేకాక పరిసర ప్రాంతాలైన నీలపల్లి, జార్జీపేట, కాపులపాలెం లకు చెందిన ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆవిధంగా సుమారు 2 శతాబ్ధాల ఫ్రెంచ్ పాలనకు తెరపడింది.


సంక్షిప్తీకరించబడిన పై అంశాలేకాక ఈ పుస్తకంలో

1. విమోచనము, డీఫాక్టో ట్రాంస్వర్, డిజ్యూర్ ట్రాంస్వర్ ట్రీటీ ఆఫ్ సిషం, మరియు విలీనము వంటి పదాల వివరణలు

2. అప్పటి విమోచన ఉధ్యమకారుల అనుభవాలు, జ్ఞాపకాలు

3. యానం విమోచనంపై భిన్నకోణాల విశ్లేషణ, డా.నల్లంగారి ఇంటర్వ్యూ, శ్రీ జార్జి సాలా జ్ఞాపకాలు అంటు వ్రాసిన వ్యాసానువాదం,

4. శ్రీ ఎస్కర్గుయిల్ నివేదిక పూర్తి సారాంశం

5. యానాం విమోచనంలో భారత సైనికుల పాత్ర, దానిపై వచ్చిన విమర్శలు, దానికి సంబందించి నెహ్రూ అప్పటి ఆంధ్రా నాయకులైన శ్రీ సంజీవ రెడ్డి కి వ్రాసిన లేఖ అనువాదం

6. విమోచనంజరిగిన మరునాడు హిందూలో వచ్చిన వార్తలో ఉన్న నిజానిజాల విశ్లేషణ 7. యానాం విమోచనం పై పాండిచేరీ నాయకుల స్పందన, అప్పటి ఫ్రెంచ్ ప త్రికలలో యానాం విమోచనవార్తా కధనాలు

8. యానాంలో ఫ్రెంచ్ పాలన మిగిల్చిన ఆనవాళ్లు

9. ఆనాటి నాయకుల దార్శనికత.

10. అప్పటి ప్రముఖుల జీవితచిత్రణలు, మరియు అప్పటి చాయాచిత్రమాలిక లో ౩౩ అరుదైన చిత్రాలతో ఈ పుస్తకం ఉంటుంది.


పేజీల సంఖ్య: 125 వెల : 50 రూపాయిలు.
కాంటాక్ట్: ప్రొఫైల్ లో ఉన్నా నా మెయిల్ ఇది కి మెయిల్ చెయ్యండి

9 comments:

Rajendra Devarapalli said...

ఆలీబాబా గారికి,ఇంత మంచి చరిత్రతోకూడిన పుస్తకాన్ని అందించినందుకు ముందుగా నా అభినందనలు.పక్కనే ఉన్న యానాం గురించి దాదాపు ఏమీ తెలియని స్థితి(మందు చౌకగా దొరుకుతుందని వినటం తప్ప)నాకు లాగా చాలా మంది ఉన్నారు.యానాం నుంచి వచ్చిన వారిలో కొందరు (శిఖామణి లాంటివాళ్ళు)ఉన్నా వారిని అడిగి ఏనాడూ తెలుసుకోవాలి అనిపించని సందేహాలు మిమ్ముల్ని అడుగుతున్నాను.ఇవ్వాళ కూడా యానాం ఆంధ్రప్రదేశ్ లో కలవకుండా ఇంకా పుదుచ్చేరి ఏలుబడిలోనే ఎందుకుంది?ప్రభుత్వపనుల మీద పుదుచ్చేరి వెళ్ళేందుకు మీకు దగ్గరదారి నౌకాయానం లాంటివి ఉన్నాయా?లేక మామూలుగా కాకినాడ వచ్చి సర్కారుఎక్స్ ప్రెస్ ఎక్కి ..అలా వెళ్ళిరావటమేనా?ఫ్రెంచివారితో ఇంకా యానాం కు అనుబంధం కొనసాగుతుందా(పెళ్ళిళ్ళు,వగైరా)ప్రస్తుత యానాం జనాభా ఎంత..ఇలా చాలా ఉన్నాయి.మీకు వీలైనప్పుడు సమాధానాలు ఇవ్వగలరు.

Bolloju Baba said...

రాజేంద్ర కుమార్ గారికి
నా వ్యాసం మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

మీరడిగిన ప్రశ్నలకు నాసమాధానాలు పెద్దదవుతున్నదన్న ఉద్దేశ్యంతో కొత్తపోష్టుగా పెట్టాను చదవండి.

బహుసా యానం ఇప్పటికీ ఆంధ్రప్రదేష్ లో కలువకుండా ఇంకా పుదుచేరీ ఏలుబడిలో ఎందుకుందో చెప్పగలిగాను అని అనుకుంటున్నాను.

యానాం పుదుచేరీల మద్య నౌకాయాన సదుపాయమేమీ లేదు. మీర చెప్పినట్టుగా కాకినాడ వచ్చి సర్కార్ ఎక్సప్రెస్ ఎక్కి వెళ్లాల్సిందే. ఇప్పుడు కొత్తగా రాజమండ్రి వెళ్లి అక్కడనుంచి విమానంలో వెళుతున్నారు.

యానాం విమోచనోద్యమ జరిగిన వెంటనే షిప్పులలో యానానికి ఫ్రెంచి సైనికులు వస్తున్నారనీ, వారు ఉద్యమంలో పాల్గొన్న వారినందరినీ కాల్చి చంపే ఉత్తర్వులు పొందిఉన్నారనీ ఒక పుకారు లేచింది. (శ్రీ దడాల ఆత్మకధ ) దీనిని బట్టి యానానికి బే ఆఫ్ బేంగాల్ గుండా షిప్పులొచ్చేవన్నమాట. అంతే కాక ఆ సమయంలో భారత ప్రభుత్వం యానాన్ని దిగ్భంధనం చేసేసింది. రాకపోకలు బందు అయిపోయినయి.

యానంలో మద్యం, పెట్రోలు చవక ఎందుకంటే వాటిపై ఇక్కడ సెంట్రల్ టాక్సులు మాత్రమే పడతాయి, స్టేటు టాక్సులు ఉండవు. యానాం పెట్రోలుకు, ఆంధ్రా పెట్రోలుకు సుమారు 6 రూపాయిల తేడాఉంటంది. ఈ ఆరు రూపాయిలు ఆంధ్రా ప్రభుత్వపు షేరన్న మాట.

మిగిలిన వస్తువులు కూడా తక్కువధరలకు ఎందుకు లభించవో ఇప్పటికీ నాకు ఒక చిదంబర రహస్యమే. (మార్కెట్ మాయాజాలమంటే ఇదేనేమో?)

ప్రస్తుతం యానాం జనాభా 32 వేలు.

మరొక విన్నపం
మీకు శిఖామణి గారు తెలుసల్లే ఉంది. ఆయన నాగురువుగారే సార్. వారికి ఈ క్రింది బ్లాగు http://sahitheeyanam.blogspot.com/ ఎడ్రసు దయచేసి ఇవ్వండి. శిఖామణి గారి ఇ మెయిల్ ఇవ్వగలిగితే మరీ సంతోషం.

మీ
బొల్లోజు బాబా


http://sahitheeyanam.blogspot.com/

Unknown said...

ఈ బ్లాగు వల్ల యానాం చరిత్ర తెలుసుకో గలిగాను. ఇంతకాలం వరకు యానాం తెలుగు మాట్లాడే ప్రాంతమని AP లో ఒక భాగం కాదని మాత్రమే తెలుగు. ఎందుకు కాలేదో ఈ blog వ్యాసాల వల్ల తెలుసుకో గలిగాను. ఈ blog లో తదుపరి post కోసం ఎదురు చూస్తున్నాను.
ఉచిత సలహా: ఫ్రాన్స్ (frAn&s) "&" force combination .
ఈ ఫ్రాంస్(frAns or fraans) software defect ఏమో అనుకొని దీని కోసం నిన్న వెతికాను. మీకు పనికి వస్తుందంటే సంతోషం.
ఇట్లు,
సాగర్.

Bolloju Baba said...

సాగరు గారికి
నిశిత దృష్టికి ధన్యవాదాలు. ఫ్రాన్స్ ను ఫ్రాన్స్ గా ఎలా టైపుచేయాలో తెలియక ఆ తప్పును అలాగే ఉంచేసాను. మీరు చెప్పిన ఈ విషయం నాకు చాలా ఉపయోగ పడుతుంది. ఇలా క్లిష్టంగా ఉండే పదాలు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడవలసి వచ్చేది.

మీకు నా వ్యాసాలు నచ్చినందుకు సంతోషంగా ఉంది.

మీరు ఇచ్చినది ఉచిత సలహా ఎంతమాత్రంకాదు. చాలా ఉపయోగపడే సలహా.
ధన్యవాదాలతో

బొల్లోజు బాబా

May 14, 2008 10:21 PM

Ramani Rao said...

ఇది ఎంత యాదృఛ్చికమంటే, నేను యానాం లో పర్యటించేప్పుడు ఉపాధ్యాయులుగా పని చేస్తున్న అన్నయ్యలని "అసలెందుకు ఇది ఆంధ్రప్రదేష్ లో కలపలేదు? అందరూ తెలుగే మాట్లాడుతున్నారుగా" అని అడిగితే ఎవరూ చెప్పలేకపోవడం, మీరు యానాం చరిత్ర గురించి విశదీకరించడం, నిజంగా నేను చాలా అదృష్టవంతురాలినన్నమాట. కొన్ని మనకు కలిగే సందేహాలు మన ప్రమేయం లేకుండానే నివృత్తి అవడం అనేది నిజంగా వింతే కదా! ధన్యవాదాలు బాబా గారు మీకు.

kusuma kumari said...

chalaa maMchi rachana,sir!
puduchchEri,mahE,karaikkaal^,chaMdra naaguuru pradESAla guriMchi kUDA ,
vIlu kudirinappuDu "nETi sthiti,nelakonna paristhitulu,chaaritraka dRkpathaMtO raastE paaThakulaku
eMtO viluvaina samaachaaramu
ichchina vaaru autaaru.
miiku aa pariSOdhananu chEsE avakaaSamu,aasaktii uMDaTamu kUDA
maMchi plass^ paayiMTE kadaa!

Ramani Rao said...

kusuma kumari has left a new comment on the post "యానాం విమోచనొద్యమం":

chalaa maMchi rachana,sir!
puduchchEri,mahE,karaikkaal^,chaMdra naaguuru pradESAla guriMchi kUDA ,
vIlu kudirinappuDu "nETi sthiti,nelakonna paristhitulu,chaaritraka dRkpathaMtO raastE paaThakulaku
eMtO viluvaina samaachaaramu
ichchina vaaru autaaru.
miiku aa pariSOdhananu chEsE avakaaSamu,aasaktii uMDaTamu kUDA
maMchi plass^ paayiMTE kadaa!

Post a comment.

Unsubscribe to comments on this post.

Posted by kusuma kumari to సువర్ణశ్రీ at June 17, 2009 6:01 AM

(బాబా గారు నా మెయిల్ అడ్రస్ కి మీ కామెంట్ వచ్చింది. నేను ఫాలోకూడా పెట్టలేదు. మరి ఎలా వచ్చిందో అసలు మీకు కామెంట్ వచ్చిందో లేదో అని.. ఇలా.. క్షమించండి )

Nrahamthulla said...

కాకినాడ దగ్గర 30చ.కి.మీ.విస్తీర్ణంగల యానాం 1954 దాకాభారత్ లో ఫ్రెంచ్ కాలనీగా ఉంది.నేడు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో భాగం.1954లో లో విమోచనం చెంది స్వతంత్రభారతావనిలో విలీనంచెందినా 1956 లో భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రంలో కలవలేదు.1948లో హైదరాబాద్ ను పోలీసు చర్యజరిపి ఇండియాలో కలిపారు.1949 లో అప్పటికి ఒక ఫ్రెంచి కాలనీ గా ఉన్న చంద్రనాగూర్, సమీపంలోని బెంగాల్ రాష్ట్రంలో విలీనం అయింది. కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ కూడా యానాన్ని కలపాలని తీర్మానం చేసింది. 870కి.మీ దూరంలోని తమిళ పుదుచ్చేరి నుండి పాలన కష్టంగా ఉంది.పుదుచ్చేరికి యానాం ప్రజల ప్రయాణం ఆంధ్రలోని కాకినాడ నుండి జరుగుతుంది.దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని యానాంలో ఏర్పాటు చేయాలని యానాం కాంగ్రెస్ తీర్మానించింది.ఇండోర్ స్టేడియం,కళ్యాణమండపం,ధవళేశ్వరం-యానాం మంచినీటి ప్రాజెక్టులకు రాజశేఖరరెడ్డి పేరు పెడతామని పుదుచేరి రెవిన్యూ మంత్రి మల్లాడి కృష్ణారావు చెప్పారు. తెలుగుజాతి సమైఖ్యత,భాషాప్రయుక్తరాష్ట్ర ప్రధాన ఉద్దేశ్యం యానాం ఆంధ్రప్రదేశ్ లో కలిస్తే నెరవేరుతుంది.తెలుగుతల్లి బిడ్డలందరూ ఒకేరాష్ట్రంగా ఉంటారు.సమైక్యాంధ్ర కోసం ఇప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయి గనుక భౌగోళికంగా సామీప్యత, 100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.కలిస్తే బాగుంటుందని ఆశ.

Bolloju Baba said...

రహంతుల్లా గారికి

మీ అభిప్రాయాల్ని గౌరవిస్తున్నాను.

యానాన్ని ఆంధ్రాలో కలిపేయటం కన్నా,ఈ ప్రాంతానికున్న చారిత్రిక నేపధ్యం ఆధారంగా దీన్నో పర్యాటక కేంద్రంగా మలచితే, ఉభయతారకంగా ఉంటుందని నా భావన.

bollojubaba