Wednesday, May 7, 2008

యానాన్ని ఆంధ్రాలో ఎందుకు కలపలేదు?


యానాం విమోచనోధ్యమము అనే నా వ్యాసాన్ని చదివి కొన్ని ప్రశ్నలు అడిగిన రాజేంద్ర కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, వారిప్రశ్నలకు జవాబుగా ఈ పోష్టు.

ఈ రోజు కు కూడా యానం ఆంద్రప్రదేశ్ లో కలవకుండా ప్రత్యేకంగా ఉండటానికి ప్రధాన కారణం.
ఫ్రెంచి వాళ్లు తమకాలనీలైన యానం, పాండిచేరీ, మాహె, కారైకాలను వదిలి వెళ్లిపోయేటపుడు , భారత ప్రభుత్వంతో 1956 may 28 న ట్రీటీ ఆఫ్ సెషను (treaty of cession) ను చేసుకున్నారు.


ఈ ఒప్పందములో ఆర్టికిల్ 2 ఇలా చెపుతుంది.
The Establishments will keep the benefit of the special administrative status which was in force prior to 1 November, 1954. Any constitutional changes in this status which may be made subsequently shall be made after ascertaining the wishes of the people.


( సారాంశం: ఈ స్థావరాలన్నీ, 1 నవంబరు 1954 కు పూర్వము కలిగిఉండినటువంటి ప్రత్యేక పరిపాలనా హోదాను నిలుపుకుంటాయి. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను తెలుసుకొన్న తరువాతే రాజ్యాంగపరంగా ఈ హోదాను మార్చవలసి ఉంటుంది)


1954 కు పూర్వం అంటే, అప్పుడు ఈ ప్రాంతాలు మిగిలిన స్వతంత్ర్య భారతావనిలో కలువకుండా ప్రత్యేకం గా ఫ్రెంచి వారిచే పరిపాలింపబడిఉన్నాయి. భారత స్వాతంత్ర్యానికి ముందు కూడా ఇవి బ్రిటిష్ వారి పాలనకు అతీతంగానే పరిగణింపబడ్డాయి.

పై క్లాజులో ఆ ప్రత్యేకత ను నిలబెట్టమనే కోరటం జరిగింది. అంటే ప్రత్యేక పరిపాలనా హోదా కల్పించాలనేది ఫ్రెంచి వారి వెళ్లిపోయేముందు అడిగిన చివరికోరిక. దానికనుగుణంగా భారత ప్రభుత్వం 1 జూలై, 1963 లో జరిపిన రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రాంతాలను యూనియను టెరిటరీ ఆఫ్ పాండిచేరీ గా ఏర్పరిచింది. అలా వీటిని కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పరచటంద్వారా ప్రత్యేక హోదా కల్పించి ఫ్రెంచి ప్రభుత్వానికి ఇచ్చినమాటను భారత ప్రభుత్వం నిలబెట్టుకుంది.


ఇంతే కాక ఈ ఒప్పందంలో ఫ్రెంచి ప్రభుత్వం ఈ ప్రాంతంలో అప్పటిదాకా ఉండిన ఫ్రెంచి సంస్కృతిని కాపాడమని కోరింది. అప్పట్లో నెహ్రూ గారుకూడా ఈ ప్రాంతాలను Windows open to France అని అభివర్ణించాడు కూడా.


ఇంత చేసినా ఫ్రెంచ్ ప్రభుత్వం సంతృప్తి చెందక 1962 లో ఈ ప్రాంత ప్రజలకు భారత పౌరులుగా ఉంటారా లేక ఫ్రెంచ్ పౌరులుగా మారిపోతారా అని ఒక సౌహార్ధ్ర పూర్వక ఐచ్చికతను ఇచ్చింది. ( రాత్రిపూట మూట ముల్లె సర్ధుకొని పోయిన బ్రిటిష్ ప్రభుత్వం తో పోల్చండి). అప్పటి దాకా ఫ్రెంచి సంస్కృతి, సాంప్రదాయాలను తరతరాలు గా జీ్ర్ణించుకొన్న కొంతమంది ఈ ఐచ్చికత ద్వారా ఫ్రెంచి పౌరసత్వాన్ని తీసుకున్నారు. అప్పట్లో యానం నుంచి పంతొమ్మిది కుటుంబాలు ఇలా ఈ ఐచ్చికత ద్వారా ఫ్రెంచి పౌరసత్వాన్ని పొందాయి. ఈ ఐచ్చికతగురించి ఎక్కువ మందికి తెలియక పోవటంతో ఆ తరువాత కూడా కొద్దిమంది ప్రయత్నించుకొని ఫ్రెంచి పౌరసత్వాన్ని పొందారు. 1987 లెక్కల ప్రకారం యానాంలోని ఫ్రెంచ్ నేషనల్స్ సంఖ్య 91. వీరి సంతతిలో చాలా మంది ఫ్రాంస్ లో జీవిస్తున్నారు. అయినప్పటికీ భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలలోనే తమ మూలాలున్నాయన్న విషయాన్ని వీరేనాడు విస్మరించలేదు. వీరు ఉండేది ఫ్రాంసులోనైనా ఎక్కువమంది ఇక్కడి అమ్మాయిల/అబ్బాయిలనే పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇలాగ ఫ్రెంచి పౌరసత్వాన్ని కలిగిఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకోవటానికి పెద్ద పోటీ కూడాను. ఎందుకో అర్ధం అయ్యిందనుకుంటాను.


యానంలో ఉండిన సీనియర్ సిటిజనులైన ఫ్రెంచ్ నేషనల్స్ కు ఫ్రెంచ్ ప్రభుత్వం నుండి నెల నెలా పించను అందుతుంది. ( మన ఒల్డ్ ఏజ్ పెంషను లాగ). ఇది భారత రూపాయిలలో మారేసరికి ముప్పై వేల రూపాయిల పైమాటే అవుతుంది. వృద్దాప్యంలో అదొక ముచ్చట.


ఇక పోతే ఈ ప్రాంతాలను సమీప రాష్ట్రాలలో విలీనం చెయ్యాలని మొరార్జీ దేశాయ్ టైములొ ఒక ప్రయత్నం జరిగింది. అంటే యానాన్ని ఆంధ్రాలోను, పుదుచేరీ, కారైకాల్ లను తమిళనాడులోను, మాహె ను కేరళలోను కలిపేయటాని కన్నమాట. దానిని ఈ ప్రాంత ప్రజలు ముక్తకంఠంతో ప్రతిఘటించారు. మొరార్జీ దేశాయ్ కూడా 1956 నాటి ఒప్పందాన్ని చూసి నాలిక్కరుచుకొని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారని అంటారు.


ఈ రోజు కు కూడా యానం ఆంద్రప్రదేశ్ లో కలవకుండా ప్రత్యేకంగా ఉండటానికి మరొక ప్రధాన కారణం ఆనాటి నాయకుల దార్శనికత.


విమోచనోధ్యమం వ్యాసంలో చెప్పినట్లు 1948 లోనే భారత-ఫ్రెంచ్ ప్రభుత్వాలు ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం ఈ ప్రాంతప్రజలు రిఫరెండం ద్వారా వారు భారతదేశంలో కలవాలా ఒద్దా అనే విషయాన్ని తేల్చుకోవాలి. తదనుగుణంగా జూను పంతొమ్మిది, 1949 లో అప్పటికి ఒక ఫ్రెంచి కాలనీ గా ఉన్న చంద్రనాగూర్, సమీపంలోని బెంగాల్ రాష్ట్రంలో విలీనం అయిపోయింది. పోలైన 12000 ఓట్లలో 7500 ఓట్లు భారతావనిలో విలీనానికి అనుకూలంగాను, 114 ఓట్లు వ్యతిరేకంగాను పోల్ అయ్యాయి. ఆవిధంగా ఆ ప్రాంతానికున్న ఫ్రెంచ్ కనెక్షను తుంచబడింది.
అలా తొందరపడి రిఫరెండం జరిపేసుకోవటంవల్ల చంద్రనాగురు ఈనాడు ఈ అఖండ భారతావనిలో ఉండే వేన వేల మునిసిపాలిటీలలో ఒకటిగా కనుమరుగైంది.


ఇక మిగిలిన నాలుగు ప్రాంతాలు ఫ్రెంచి వారిని అంత సులభంగా చేజార్చుకోవటానికి ఇష్టపడలేదు. భారతప్రభుత్వం కూడా పరిస్థితులు పక్వానికొచ్చేదాకా ఎదురుచూసింది. హైదరాబాద్ లొలాగా సైనిక పదఘట్టనలతో బలప్రయోగానికి సాహసించలేదు. అందునా ఇది దేశాల నడుమ వ్యవహారమాయె!


చంద్రనాగూర్లోని స్థానిక నాయకులందరూ పొరుగునున్న బెంగాల్ రాష్త్ర కమ్యూనిష్టు నాయకుల ప్రభావంలో ఉండి ఆ ప్రాంతాన్ని, విదేశీ పాలనా చెరనుండి విడిపించి పొరుగు రాష్ట్రమైన బెంగాల్ లో విలీనంచేయించటం లో కృతకృత్యు లయ్యారు.

కానీ అప్పటి యానాం నాయకులు పొరుగున ఉన్న ఆంధ్రా నాయకుల ప్రభావంలో కాక, పాండిచేరీ లోని నాయకుల నాయకత్వంలో నడిచారు. 1948 భారత్-ఫ్రెంచ్ ఒప్పందం ప్రకారం రిఫరెండం ప్రక్రియకు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతాన్నే ప్రాతిపదికగా తీసుకోవాలి. దీన్ని బట్టి చూస్తే అప్పటి యానాం నాయకులు ఆంధ్రావైపు ఎక్కువగా మొగ్గుచూపి ఉన్నట్లయితే చంద్రనాగూర్ వలెనే యానాం కూడా, ఆంధ్ర ప్రదేశ్ లో ఏ విశిష్టతా లేని ఒక పంచాయతీ గా మిగిలిపోయేది. కాకినాడ మునిసిపల్ కౌంసిల్ కూడా యానాన్ని భారతావనిలో కలిపేసుకోవాలని తీర్మానం చేసింది. కానీ అప్పటి యానాం నాయకులు ముందుచూపుకలిగి పాండిచేరీ తో ఉన్న సంబంధాలను తెంపుకోలేదు. పాండిచేరీ తో తమ అనుబంధాన్ని త్రుంచుకోవాలని కలలో కూడా అనుకోలేదు. అపుడు మాత్రమే యానం ప్రజలకు మేలు జరుగుతుందని భావించారు. ఇది వారి దార్శనికతకు, రాజకీయ పరిణితికి నిదర్శనంగా చెప్పుకోవచ్చును.
పుదుచ్చేరీ నాయకులు ఈ నాటికీ కూడా యానాన్ని తమలో ఒక అంతర్భాగంగానే చూస్తున్నారు తప్ప వేరుగా చూడలేదు.


డిల్లీ కి ఇచ్చినట్టుగా పుదుచేరీ కి కూడా స్టేట్ హుడ్ ఇస్తారని ఈ మద్య వింటున్నాము. ఏమవుతాదో చూడాలి.

బొల్లోజు బాబా

యానాం పై తదుపరి వ్యాసం: 18 వ శతాబ్ధంలో యానంలో జరిగిన బానిస వ్యాపారం.

8 comments:

Rajendra Devarapalli said...

మీవివరణ అద్భుతం బాబా గారు

Kk said...

hi babbya
yeah iwas kinda expecting you to say that international level thing about my posts. i am trying to get localised and i am known for such extraordinary obessions (posting abt english ppl n music)
moving on, i will dad to check ur blog.
pls do write in english at least one.........

Nrahamthulla said...

కాకినాడ దగ్గర 30చ.కి.మీ.విస్తీర్ణంగల యానాం 1954 దాకాభారత్ లో ఫ్రెంచ్ కాలనీగా ఉంది.నేడు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో భాగం.1954లో లో విమోచనం చెంది స్వతంత్రభారతావనిలో విలీనంచెందినా 1956 లో భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రంలో కలవలేదు.1948లో హైదరాబాద్ ను పోలీసు చర్యజరిపి ఇండియాలో కలిపారు.1949 లో అప్పటికి ఒక ఫ్రెంచి కాలనీ గా ఉన్న చంద్రనాగూర్, సమీపంలోని బెంగాల్ రాష్ట్రంలో విలీనం అయింది. కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ కూడా యానాన్ని కలపాలని తీర్మానం చేసింది. 870కి.మీ దూరంలోని తమిళ పుదుచ్చేరి నుండి పాలన కష్టంగా ఉంది.పుదుచ్చేరికి యానాం ప్రజల ప్రయాణం ఆంధ్రలోని కాకినాడ నుండి జరుగుతుంది.దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని యానాంలో ఏర్పాటు చేయాలని యానాం కాంగ్రెస్ తీర్మానించింది.ఇండోర్ స్టేడియం,కళ్యాణమండపం,ధవళేశ్వరం-యానాం మంచినీటి ప్రాజెక్టులకు రాజశేఖరరెడ్డి పేరు పెడతామని పుదుచేరి రెవిన్యూ మంత్రి మల్లాడి కృష్ణారావు చెప్పారు. తెలుగుజాతి సమైఖ్యత,భాషాప్రయుక్తరాష్ట్ర ప్రధాన ఉద్దేశ్యం యానాం ఆంధ్రప్రదేశ్ లో కలిస్తే నెరవేరుతుంది.తెలుగుతల్లి బిడ్డలందరూ ఒకేరాష్ట్రంగా ఉంటారు.

Bolloju Baba said...

రహంతుల్లాగారు

మీది యానమా? మాదీ యానమే.
నేనుండేది కాకినాడ లో. మనం కలుసుకొనే అవకాసం ఉంటుందనుకొంటున్నాను.
నాఫోను.9849320443

బొల్లోజు బాబా

Nrahamthulla said...

బొల్లోజు బాబా గారూ
సమాధానం చాలా ఆలశ్యం అయ్యింది.విజయవాడ ఉడాలో డిప్యూటీ కలెక్టర్ను.ఫోన్9949778519.యానం ఆంధ్రప్రదేశ్ లో కలిసి తెలుగు ప్రజలందరూ ఒకేరాష్ట్రంగా ఉండాలని కోరిక .
శుభాకాంక్షలు
రహంతుల్లా

Telugu Movie Buff said...

బాబా గారు
మాకు తెలియని విషయాలను చక్కగా వివరించారు

Phani Polapragada - ఫణి పోలాప్రగడ said...

Very good one...I learnt so many things..

వీరుభొట్ల వెంకట గణేష్ said...

బొల్లోజు బాబా గారు:
మిత్రుడు చైతన్య ద్వారా మీ పోస్ట్ గురించి తెలిసి వచ్చాను. మీ వివరణ బాగుంది.